This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Film Reviews
సూటిగ సూటిగ దీటుగ దీటుగ

సూటిగ సూటిగ దీటుగ దీటుగ

చిత్రం : కొమరం పులి

సంగీతం : ఎ.ఆర్. రెహమాన్
రచన : చంద్రబోస్
గానం : శ్వేతామోహన్, నరేష్, అయ్యర్, బృందం
 
 
ఓయ్......
సూటిగ సూటిగ దీటుగ దీటుగ - నాటుకు పోయిన చూపుల కొట్టుడు
చీటికి మాటికి మాటికి చీటికి - ఘాటుగ తాకిన ఊపిరి కొట్టుడు
దాటక దాటక గీతను దాటి - మాటలు చెప్పే చేతల కొట్టుడు
కొట్టినవాడే దగ్గర జరిగే - దగ్గర జరిగే సిగ్గుల కరిగే
సిగ్గులు కరిగే - ప్రేమలు పెరిగే.... ఓ ఓ
ప్రేమలు పిండగ నోములు పండగ
కోమలి చెంపలు మళ్ళీ కొట్టాలే
ఏ....అమ్మా తల్లే.... నోర్మూయవే.... నోటి ముత్యాల్ జార్నీయకే...
అమ్మా తల్లే.... నోర్మూయవే.... నోటి ముత్యాల్ జార్నీయకే...
 
ఆ మబ్బును గాలే తాకీ - ఆ గాలికి మబ్బే ఆగీ
పొంగేనంట వర్షం
మరి నీ దెబ్బకి బుగ్గే కందీ - నా బుగ్గల రంగే చందీ
అందేనంట హర్షం
ఉలి తాకిడి సోకిన మారును కాదా శిల శిల్పం
పులి దూకుడు చూడగ రేగును కాదా చెలి మురిపెం
వేలే కమ్మగ తాకిన వెంటనె - లేలెమ్మని నిద్దుర లేచె
వేణువు మదిలో మధుర మథనం
నా కొమ్మను తాకిన వెంటనె - పూరెమ్మల తేనెలు పుట్టి
రగిలే నిషా ఉషోదయం
నువ్వు నచ్చిన చోట నవ్వెను అందం
గిచ్చిన చోట యవ్వన గంధం
నీకు నాకు జీవన బంధాలే
ఏ... అమ్మా తల్లే నాన్చెయ్యకే.... నవ్వు రత్నాల్ రాల్చెయ్యవే
 
 
నువ్ నువ్ ఎక్కడ వుంటే నేనక్కడ పక్కన వుంటా
నా దిక్కువి నువ్వేనంటా ఉక్కిరి బిక్కిరి చేస్తూంటా
నా చుక్కకి జాబిలివంట నా రెక్కకి పావురమంట
నువ్వే నేనటా
అమ్మా తల్లే అల్లాడకే
 
ఓ.... రేపని మాపని మాపని రేపని - లేదని కాదని కాదని లేదని
వేదన వాదన బోధన సాధన చాలించమంటా
నీ వాకిలి వేకువనౌతా - నీ చీకటి చాకిరినౌతా
నాకై కేకలు పెడితే కాకిలా
నయగారాల చిలకా - చిలక చిలకా చిలక చిలకా
నువ్వు నా నింగిని కోరిన వేళవే గంగలుగా
మరి ఆ గంగ తిరిగే నేల
సంగమాలు సంభవించేలా ఎలా ఎలా ఎలా ఎలా....
న నానన నానన నానననా .... నానన నానన నానననా
న నానన నానన నానననా .... నానన నానన నానననా
 
జాబిలి బొమ్మా జాబిలి బొమ్మా జాబిలి బొమ్మా
జాబిలి బొమ్మా జాబిలి బొమ్మా జాబిలి బొమ్మా
జాబిలి బొమ్మా జాబిలి బొమ్మా జాబిలి బొమ్మా
జాబిలి బొమ్మా జాబిలి బొమ్మా జాబిలి బొమ్మా
 
కొట్టినవాడే దగ్గర జరిగే - దగ్గర జరిగే సిగ్గులు కరిగే
సిగ్గులు కరిగే - ప్రేమలు పెరిగే .... ఓ ఓ
ప్రేమలు పిండగ నోములు పండగ
కోమలి చెంపలు మళ్ళీ కొట్టాలే
పమ పాప... పమ దాద...
దానీ నీస నిస..... దనిదస నీదప
సా సాస ససరీరి
 
అమ్మా తల్లే నోర్మూయవే... నోటి ముత్యాల్ జార్నీయకే....
నోటి ముత్యాల్ జార్నీయకే.... నోటి ముత్యాల్ జార్నీయకే.... నోటి ముత్యాల్ జార్నీయకే
 
 
 
సినిమా పాట - ఒంటరిగా పాడుకునే స్థాయి నుంచీ పదిమంది ముందూ ప్రదర్శించే స్థాయికి వెళ్ళిపోయింది.  కూచున్న పాట నిలబడింది. నడిచింది. పరుగులు పెట్టింది. ఈ పరుగుల్లో మళ్లీ పలు రకాలు. ఉదాహరణకి ఛేజింగ్ సీన్స్లో మిగిలిన హీరోలు పరుగెడుతుంటే ఒకలా వుంటుంది. కానీ మహేష్ బాబూ, జూనియర్ ఎన్టీఆర్ పరుగెడుతుంటే ఇంకోలా వుంటుంది. వీళ్ళ పరుగులో ఓ గ్రేస్ కనబడుతుంది. మనక్కూడా పరిగెత్తాలన్నంత ఉత్తేజం కలుగుతుంది. ఆ ఉత్తేజంలో ఓ ఆనందం వుంటుంది. ఓ ఆకర్షణ వుంటుంది. వెర్రి వుండదు. వ్యామోహం వుండదు. సరిగ్గా అటువంటిదే ఈ 'అమ్మా తల్లే' పాట కూడా...
 
1964లో విడుదలైన 'అరుణగిరి నాదర్' తమిళ చిత్రంలోని 'ముత్తైతరు' అనే పాట వింటే ఎవరికైనా సరే ఆశ్చర్యం కలుగుతుంది. ట్యూన్ చేయడానికి, రాయడానికి, పాడడానికి ఎంతో కష్టంగా వుండే అటువంటి పాట తెలుగులో వస్తుందా అని ఎదురు చూసేవారికి రవ్వంత ఓదార్పులా నిలుసు్తందీ పాట. ఎందుకంటే అలాంటి పాటని ట్యూన్ చేయాలంటే అపారమైన సంగీత జ్ఞానంతో పాటు ప్రయోగాలు చేసే తత్వం ఉండాలి. రాయడానికి భాష మీద కమాండ్ వుండాలి. పాడడానికి తగిన గ్రాస్పింగ్ పవర్తో పాటు అతి స్పష్టంగా వుండే వాచకం కావాలి. ఇన్ని జత పడితేనే అటువంటి పాట వస్తుంది. నిజానికి ఆ పాట విని ఈ పాట వింటే ఏమిటీ పోలిక అని అనిపించవచ్చు, గానీ ఆ పాట విని మాతృభాష మీద మమకారంతో ఎదురు చూసే వారికిది ఓ ఉదాహరణలా మిగలొచ్చు. ఏది ఏమైనా తెలుగు సినీ సంగీత చరిత్రలో ఓ ప్రయోగంగా నిలిచిపోయే పాట యిది.
 
ఈ పాటలో లేటెస్ట్ ట్రెండ్స్కి సవాల్గా నిలిచే ఓ శాస్త్రీయత వుంది. అలాగని ఆ శాస్త్రీయ పరిధుల చట్రంలో ఇరుక్కుపోకుండా మనోభావ సంగీతానికున్న బలమైన ఆకర్షణని సరైన మార్గంలో నడిపించే సంస్కారవంతమైన ఆధునికత కూడా వుంది. విన్న ప్రతీవారు - సంగీత దర్శకుణ్ణి, రచయితని, గాయననిని ప్రశంసించడమే తప్ప మరో ఆలోచనకు తావు ఇవ్వని ఔన్నత్యం వుంది. అందుకే ఈ పాట వినగానే మొదట థ్రిల్లవుతాం. ఆ తర్వాత ముచ్చట పడతాం. (అన్నమయ్య సినిమాలో అన్నమయ్య పెళ్ళిపల్లకి మోసిన వెంకటేశ్వర స్వామి 'పరవశిస్తాం - పల్లకి మోస్తాం' అన్నట్టు).
 
ఈ పాట స్వరరచనలో రెహమాన్ చూపించిన ప్రజ్ఞ అంతా ఇంతా కాదు. పాటని జెట్ స్పీడ్లో నడపాలన్న ఆలోచన అందులో మొదటిది. శాస్త్రీయ పరంగా ఓ వైపు సింధుభైరవి, నటభైరవి రాగాల స్వరాల్ని-వాటి స్కేల్స్ని, శంకరాభరణం స్కేల్ని కలుపుకుంటూ - రెండవ చరణంలో పంతువరాళిని కూడా జత చేస్తూ ఎక్కడా ఏ రాగంలోనూ ఉండిపోకుండా వాటి స్కేల్స్ని మాత్రం సస్టెయిన్ చేస్తూ - మరోవైపు ఆర్కెష్ట్రయిజేషన్ ద్వారా నవ్యతకు పెద్ద పీట వేస్తూ - మరింత ఉద్వేగం కలగడానికి మేల్ కోరస్ని 'బహుమేల్' గా ఎక్కడ కావాలో అక్కడ వాడుకుంటూ - టోటల్గా స్పీడ్ త్రెడ్ తెగిపోకుండా వీటన్నిటినీ ముడేసి లాక్కొచ్చిన తీరు ఒక్క మాటలో అద్భుతం.... రెండు మాటల్లో మహాద్భుతం. (మొదటి చరణం బిగినింగ్లోనూ ఆ చరణానికి ముందు వచ్చే ఆర్కెష్ట్రయిజేషన్లోనూ యమన్ రాగఛాయలు కనిపిస్తే కారణం శంకరాభరణం స్కేల్లో నడిపంచడమే)
 
ఇక రచన గురించి - ఏ ట్యూన్ గుర్తుండాలన్నా లిరిక్ చాలా అవసరం. మరి నోటికి ఓ పట్టాన పట్టుబడని లిరిక్ని శబ్దప్రదానంగానే కాకుండా అర్థవంతంగా కూడా వుంటూ కేవలం ఎక్స్పెరిమెంట్ కోసం మాత్రమే రాయాలంటే? ప్రభావితం చేసే ట్యూన్తో ప్రవాహంలా సాగిపోగల ఈ లిరిక్ ఆ ప్రభంజనంలో కొట్టుకుపోతే? ఈ సవాళ్ళని, సందేహాలని ఎదుర్కోడానికి మొదట టీమ్ స్పిరిట్ వుండాలి. ఆ టీమ్లో తన ప్రత్యేకతని నిలబెట్టుకోగల సామర్థ్యం వుండాలి. వీటి వెనక గత జన్మలోదో, ఈ జన్మలోదో తనదైన వ్యక్తిగత సంస్కారం వుండాలి. అవన్నీ తనకున్నాయని ఋజువు చేసుకున్నాడు చంద్రబోస్ ఈ పాట ద్వారా.
 
అందుకే ఈ పాటకు సంబంధించిన అనుభవాలు చెప్పమంటే వెంటనే స్పందించాడాయన. ''సీడీలో ఇప్పుడు మీరు వింటున్న పాటలో 80 శాతం నాలుగు గంటల్లోనే రాశేశాను. రెహమాన్ గారు ట్యూన్ వినడానికి చెన్నై రమ్మన్నారు. వెళ్ళాను. వినిపించారు. 'ఈ ట్యూన్ డైరెక్టర్ గారికి కూడా తెలీదు. నేను చెప్పే వరకూ ఎవ్వరికీ వినిపించకు' అని కండిషన్ పెట్టారు. ఫస్ట్ శ్వేతా మోహన్ని, జీన్స్ శ్రీనివాస్ని పిలిపించారు. ఒక వెర్షన్ రికార్డయింది. ఈలోగా డైరెక్టర్ గారికి టెన్షను. ''ఏం జరుగుతోంది రాశారు?'' అని అడగడం మొదలు పెట్టారు.
 
అప్పుడాయనతో చెప్పాను - నాకిలా కండిషన్ పెట్టారండి. మొత్తం అంతా అయ్యాక మిమ్మల్ని థ్రిల్ చేస్తారనుకుంటా - అన్నాను. ఆ తర్వాత రెహమాన్ గారు పంపించిన సాగ్ విని 'హీరో గారి పోర్షన్ తక్కువగావుంది.... పెంచాలి' అన్నారు. మళ్ళీ మార్పులు, 'అమ్మా తల్లే.... అల్లాడకే దగ్గర్నుంచీ జాబిలి బొమ్మా' వరకూ తర్వాత యాడ్ చేసిందే.... అలా మొత్తం పాట తయారయే సరికి మరో నెల పట్టింది. ఇక ఈ పాట రికార్డయి బైటికొచ్చాక మ్యూజిక్ లవర్స్ నుండి నాకెన్ని కాల్స్ వచ్చాయో చెప్పలేం. ఇండస్ట్రీలో వున్నవాళ్ళ దగ్గర్నుంచైతే అంతే లేదు. ముఖ్యంగా హీరో సిద్ధార్థ అయితే తన ట్విట్టర్లో ఈ పాట గురించి రాస్తూ 'లిరికల్ మావెరిక్' (Lyrical Maverick) అన్నాడు. అంటే సమ్థింగ్ స్పెషల్ అని అర్థం'' అంటూ ఎంతో వివరంగా చెప్పుకొచ్చాడు చంద్రబోస్.
 
ఇక ఈ కష్టంలో పాలు పంచుకున్న మరొక వ్యక్తి - గాయని శ్వేతా మోహన్. నిజానికి ఆ అమ్మాయి కష్టం చాలా ఎక్కువ. ఎందుకంటే ఆమెకు తెలుగు రాదు కనుక. ఇంతకీ ఈ శ్వేతా మోహన్ ఎవరో తెలుసా? ప్రముఖ గాయని సుజాత గుర్తుందా? అబబ్బా ఇద్దూ (చూడాలనివుంది), చెప్పవే చిరుగాలి (ఒక్కడు) కొంత కాలం కొంత కాలం (చంద్రముఖి), చక్కెర ఎక్కడ నక్కిన (నానీ) అడిగీ అడగలేక (దేవదాస్), చిగురాకు చాటు చిలకా (గుడుంబా శంకర్), ముక్కుపై ముద్దు పెట్టు (చందమామ) పాటల్ని పాండింది ఆవిడే. ఆ సుజాత కుమార్తే ఈ శ్వేత. 'రామ్' సినిమాలోని 'నువ్వేనా' అదే పాటతో యువన్ శంకర్ రాజా ద్వారా తెలుగువారికి పరిచయమైంది. అంతకు ముందు చిన్నపిల్లగా వుంటున్నప్పుడు రెహమాన్ సంగీతాన్నిచ్చిన 'బొంబాయి' లో 'కుచ్చికుచ్చి కూనమ్మా' పాటలో పిల్లలకి పాడింది. 'రామ్' తర్వాత 'సిద్ధు ఫ్రమ్ సికాకుళం'లో 'నా బాబా నానానా', 'ఆవకాయ్ బిర్యాని'లో 'నన్ను చూపగల అద్దం', 'విలేజ్లో వినాయకుడు'లో 'చినుకై వరదై' పాటల్ని పాడింది. సీతారాముల కళ్యాణం లంకలో, ఆడవారిమాటలకు అర్థాలే వేరులే, బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్లో కూడా శ్వేత పాడిన పాటలున్నయి. మహేబ్ బాబుతో త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రం 'ఖలేజా'లో మణిశర్మ సంగీత దర్శకత్వంలో కూడా పాడిందీమె. రెహమాన్తో శంకర్ సినిమా 'రోబోట్'లో పాడిన 'బూమ్ బూమ్ రోబోరా' పాట పాడింది.
 
కొమరం పులిలోని ఈ 'అమ్మా ....తల్లే' పాట గురించి (ఇంగ్లీషులో) మాట్లాడుతూ ''నాకు తెలుగు అస్సలు రాదు. ఇది ఎంత డిఫికల్ట్ ట్యూనో అంత డిఫికల్ట్ లిరిక్. చంద్రబోస్ గారు, జీన్స్ శ్రీనివాస్ గారు ఎంతో ఓపికతో ఎలా పాడాలో చెప్పి మరీ పాడించుకున్నారు. నా పేరులో వున్న మోహన్ మా నాన్నగారి పేరు. ప్రస్తుతం ఎం.బీ.యే. కరస్పాండెన్స్ కోర్స్ చేస్తూ వాటికి సంబంధించిన ప్రవేట్ క్లాసెస్కి అటెండ్ అవుతున్నాను. జీ.ఈ.లో ఇంటర్నల్ ఆడిటర్గా పనిచేస్తున్న అశ్విన్తో నా మ్యారేజ్ ఫిక్స్ అయింది. 16 జనవరి 2011న పెళ్లి'' అని చెప్పింది శ్వేత (శ్వేతా మోహన్).
 
ఈ పాటలో శ్వేతతో పాటు వినిపించే మేల్ వాయిస్ నరేష్ అయ్యర్ది. 'హ్యాపీ డేస్' టైటిల్ సాంగ్ ద్వారా. 'లీడర్'లోని 'ఔననా కాదనా' పాట ద్వారా అతణ్ణి విన్నారు తెలుగువారు. 'రెహమాన్ దృష్టిలో ఎలా పడ్డారు?' అని అడిగితే 'ఛానల్ వి ఆరు అద్నాన్ శామీ'' ఆధ్వర్యంలో నిర్వహించిన సూపర్ సింగర్స్ కాంపిటేషన్లో పాల్గొన్నాను. దానికి ఓ రోజు గెస్ట్గా రెహమాన్ గారు వచ్చారు. 'ఛయ్య ఛయ్య ఛయ్యా' పాటను ఆయన ఎదురుగా పాడే అదృష్టం కలిగింది. అలా ఆయన నా పాట విన్నారు. ప్రస్తుతం ముంబైలో వుంటున్నాను. పాటల కోసం పిలిచినప్పుడు ముంబైకి చెన్నైకి మధ్య షటిల్ సర్వీస్ చేశాను'' అంటూ చెప్పుకొచ్చాడు నరేష్ అయ్యర్.
 
ఇవీ ఈ పాటకు సంబంధించిన విషయాలు. ఇవన్నీ చదివి, పాటను వినండోసారి. 'ఎ సాంగ్ టు రిమెంబర్' కాదు 'ఎ సాంగ్ కెనాట్ బి ఫర్గాటెన్' అంటారు.
 
రాజా