ఆలీబాబ ఆలీబాబ ఇట్సోకె బాబ (నిప్పు)
ఫ్రెండ్ షిప్ కి సంబంధించి మరో సినిమా పాటొకటి వచ్చింది.
' ఆలీబాబా ఆలీబాబా - ఇట్సోకే బాబా డోంట్ వర్రీ బాబా'
అంటూ 'నిప్పు' సినిమా కోసం విశ్వ రాశాడు. పాట గురించి చెప్పే ముందు విశ్వ గురించి చెప్పాలి. రచయిత, స్వరకర్త , గాయకుడు ఈ మూడిటిలో ఎప్పుడు ఎలా కావాలంటే అలా మారిపోయి మాంచి రిజల్ట్ ఇవ్వగల సమర్ధుడితను. ఒక్కోసారి మూడు తానే అయిపోయి తన పాట తోనే సినిమాకి గుర్తింపునివ్వగల త్రిముఖ ప్రజ్ఞాశాలి కూడా (ఉదా : పడితినమ్మో... నేను- నా రాక్షసి) .
'పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే ' (అతడు) లాంటి ఆలోచింప చేసే ప్రయోగాలూ,
'గీత విను దొరకదు గుణ గణమే - చేవగల చతురత కణకణమే - చీడలను చెడమడ దునమడమే - నేటి మన అభినవ అభిమతమే - ఓటమిని ఎరుగని పెను పటిమే - పాదరస ఉరవడి నరనరమే -సమరమే సై ఇక చలగిక చకచక - ఎడతెగ చెయ్ ఇక విలయపు తైతక ' (దూకుడు) లాంటి టంగ్ ట్విస్టింగ్ పదాలతో ట్యూన్ లోని చెడుగుడుతనాన్ని మరింత ఆకర్షణీయం గా మలచగల పదకేళి విలాసం - ఇవన్నీ విశ్వకి పెన్ను తో పెట్టిన విద్యలు .
ఈ 'ఆలీ బాబా ' పాటలో కూడా ఫ్రెండ్ షిప్ మీద కొటేషన్ లాగ వాడుకోదగ్గ చరణం ఒకటి రాశాడు.
' నమ్మకాల దొంతరల్లో పుట్టేదీ - అంతరాల అడ్డుకట్ట నెట్టేదీ - నిన్నోడ నివ్వనీ తోడూనీడిదీ -
స్నేహమన్న ఒక్క నీతి కారణాన - రారాజు కూడ చేరెలే స్వర్గానా - మైత్రి మారునా యుగాలు మారినా '
ఇది ఆ పాటలో ఆఖరి చరణం. రెండో చరణం లో తన పదకేళీ విలాసాన్ని మరోసారి చూపించాడు. ' జత నస వస పిసినారైనా ' అన్నాడు. జత అంటే జతగాడు (స్నేహితుడు) . వాడు ఎంత నస గాడైనా, వస పోసిన పిట్ట లా ఎంత వాగుడు కాయైనా, ఆఖరికి పరమ పిసినారైనా ఫ్రెండంటే ఫ్రెండేగా . లోపాలతో సహా ప్రేమించే వాడేగా ఫ్రెండంటే. అందుకే ' ఏ దోస్ తీ గమ్మత్తుదీ ' అన్నాడు పల్లవి లో . ( దోస్తీ ని అలా వేరు చెయ్యకూడదు అనకండి. ఆర్డీ బర్మన్ అంతటి వాడే ' ఏ ... దోస్ తీ - హమ్ నహీ చోడెంగే' అంటూ ట్యూన్ చేసాడు).
నిజానికి ఏ దోస్ తీ అన్నదే ఆసలు పల్లవి. 'ఆలీబాబా ఆలీబాబా ఇట్సోకే బాబా డోంట్ వర్రీ బాబ' అన్నవి హుక్ లైన్లు. ఇవి తమన్ ఇచ్చినవే అయివుంటాయి. ఎందుకంటే - 'ముస్తాఫా ముస్తాఫా డోంట్ వర్రీ ముస్తాఫా' అన్నాడు గా ఏ. ఆర్. రెహమాన్. అతను 'ముస్తఫా' ను పాపులర్ చేస్తే మనం 'ఆలీబాబా' ని పాపులర్ చేద్దాం అనుకోవచ్చు. క్రియేటివ్ ఫీల్ల్ద్ లో ఇలాటివి తప్పు కానే కాదు. ఏ ప్రయోగమూ చెయ్యకపోతే అది క్రియేటివిటీ ఎలా అవుతుంది ? పైగా తమన్ ఈ పాటకి మిక్కి జే మేయర్ లా ' తడి కన్నులనే తుడిచే నేస్తమా ' లాంటి సెంటిమెంట్ రూట్ ని కాకుండా - రెహమాన్ చూపించిన 'ముస్తఫా' లాంటి ఫుల్ జోష్ రూట్నే నమ్ముకున్నట్టున్నాడు.అందుకే ఈ ' ఆలీబాబా ' అలాంటి 'జోష్ ఫుల్' ట్యూన్ ఇచ్చాడు. బీట్ లోనూ, ఆర్కేష్ట్రయిజేషన్ లోనూ మధ్య మధ్య' గురువారం మార్చ్ ఒకటి ' (దూకుడు) గుర్తొస్తూ వుంటుంది. అది గుర్తొస్తూ వుంటుందో లేక మనం దాన్ని మర్చిపోలేకపోతున్నామో !? ఎనీ వే
వీటన్నిటిని మించినది ఈ పాటని జావేద్ ఆలీ తో పాడించడం . అతని వాయిస్ భలేగా సూట్ అయిందీ పాటకి.
జావేద్ ఆలీ గురించి చెప్పాలిక్కడ. అసలు పేరు జావేద్ హుస్సేన్ . ప్రముఖ గజల్ సింగర్ ఉస్తాద్ గులాం ఆలీ దగ్గిర శిష్యరికం చేశాడు కనుక గురునామం స్వీకరించి తన పేరులో కలుపుకున్నాడు. ఎంత మంచి సంస్కారమో కదా !? 'జోధా అక్బర్' లోని 'కేహేనేకొ జష్న్- ఎ - బహారా హే '(Jashn-E-Bahaaraa)
పాట ద్వారా అందరికీ తెలిశాడు. రెహమాన్ ఇలాటి వాళ్ళని వెతికి మరీ పట్టుకుంటాడు. తర్వాత తెలుగులో - రామ్ నటించిన 'గణేష్' లో 'తనేమందో' అనే ఓ మంచి పాట చాలా బాగా పాడేడు. సినిమా హిట్ కాకపోవడంతో పాట పాపులర్ కాకుండా పోయింది. తర్వాత'మహం మహమాయే ' (కొమరం పులి), 'ఏవో పిచ్చి వేషాలు' (వాంటెడ్) రావా సక్కని రసగుల్లా ( శక్తి లో సుర్రా సుర్రన్నాడే) పాటలు పాడేడు.
తమన్ రెహమాన్ రూట్ నే నమ్ముకున్నాడనడానికి మరో చిన్న ఉదాహరణ కనబడుతోందీ పాటలో. 'ఏ మాయ చేసావే ' లో 'కుందనబ్బొమ్మ' పాట గుర్తుందా ? అందులో 'నీ పాదం నడిచే ' దగ్గర బెన్నీదయాళ్ 'ఊ ఊ ఊ ఊ' అంటూ పాడతాడు. ఈ 'ఆలీబాబా' పాటలో జావేద్ ఆలీ తో రెండో చరణం ఎండింగ్తర్వాత అలా అనిపించడానికి ట్రయ్ చేసాడు తమన్. కుందనబ్బొమ్మ పాటలో ఉన్నంత లెంగ్త్ వుండదు గానీ దాన్ని మాత్రం గుర్తు చేస్తూ వుంటుంది.
పాటని మామూలు గా వినండి ... తర్వాత లిరిక్ ఎదురు గా పెట్టుకుని వినండి ... ఆ తర్వాత పాడడానికి ప్రయత్నిస్తూ వినండి. కచ్చితంగా ఈ మూడు దశల్లోనూ మీ అభిప్రాయాల్లో కలిగే మార్పు ని మీరే గమనిస్తారు.
ఆలీబాబా ఆలీబాబా
ఇట్సోకే బాబా డోంట్ వర్రీ బాబా
లెట్స్ గో (లేట్ అస్ గో)
ఏ దోస్ తీ గమ్మత్తుదీ
పణవెట్టే ప్రాణం సైతం తృణ మంటుందీ
ఏ దోస్ తీ గమ్మత్తుదీ
ఉండగానే మిత్రుడు అన్ని తానై
పైసలతో పనేమి సబ్ అప్ నా హై
చలో పదా మరీ జమానా జీత్ నే
అల్లుకున్న ఆశలేరా ప్రేమంటే
ఆశ లేని పాశమేర మైత్రంటే
కాన ఎప్పుడూ ఫ్రెండ్స్ లవ్ యూ
// ఆలీ బాబా //
జత నస వస పిసినారైనా
చెల్లుర సుమతీ
............
లోకమంత వింటదీ చెప్పేదీ
చెప్పలేక వున్న వింటదీ ఈ దోస్తీ
అందుకే ఇదీ సాటిలేనిదీ
// ఆలీ బాబా //
నమ్మకాల దొంతరల్లో పుట్టేదీ
అంతరాల అడ్డుకట్ట నెట్టేదీ
నిన్నోడ నివ్వనీ తోడూనీడిదీ
స్నేహమన్న ఒక్క నీతి కారణాన
రారాజు కూడ చేరెలే స్వర్గానా
మైత్రి మారునా యుగాలు మారినా
// ఆలీ బాబా //
on 1