'జయనామ'సంవత్సరపు ఉగాదికి సినీ రైటర్స్ అసోషియేషన్ వారు కవి సమ్మేళనం పెట్టుకున్నారు. అందులో రామజోగయ్య శాస్త్రి గారు రాసిన కవిత ఇది. ఇక స్పెషల్ గెటప్ గురించి అంటారా ... అనుకోకుండా అది అలా కుదిరిపోయింది. ఒరిజినల్ గా ఆయనది బట్టతల. అది గాక ఈమధ్య ఫ్రెంచ్ కట్ మెయిన్ టెయిన్ చేస్తున్నారు. దానికి తోడు వెళ్ళగానే ఆయనకో కండువా కప్పేరు. దాంతో ఆయన గెటప్ ఇలా ప్రత్యేకంగా తయారయిపోయింది. ఇవన్నీ మర్చిపోయి కవితని పరీశీలించండి. ఇంత సినిమా పాటల బిజీ షెడ్యూల్ లో కూడా ఎంత డెప్త్ తో రాశారో అనిపిస్తుంది.
నిశ్శబ్దపు కాసారంలోకి
నా మౌనాన్ని విసిరేశాను
తరంగాల కొలది నా స్వరం ప్రకంపించింది
ఎటు చూసినా అలజడి ... అలజడి
ఈ అలజడిలో ఒక ప్రయోజనం ఉంది ... ప్రశాంతత ఉంది
కోలాహల జనహేలా ప్రపంచం నుంచి
ఏకాంతంలోకి నన్ను నేను వెనక్కి తీసుకున్నాను
మనస్సంతా ప్రశాంతవనంలా పరిమళించింది .... కానీ
ఏ క్రాంతికీ దోహదపడని ఈ ప్రశాంతిలో
నాలో నాకే ఏదో అలజడి
విచిత్రంగా ... కనిపించినా ... నిజం ఇదే ...
ఎందుకంటే
వాక్కు నా అస్థిత్వం
వాక్కు నా వ్యక్తిత్వం
అన్నిటికీ మించి
లౌక్యానికి, సత్యానికి
నాలో నిరంతరంగా జరిగే
సంఘర్షణను పటాపంచలు చేసే
అద్వైతానికది సంకేతం
- రామజోగయ్య శాస్త్రి