This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...

 ఏదైనా ఫంక్షన్ లో అతను కనబడితే చాలు అమ్మాయిలందరూ బిల బిలమంటూ  చుట్టూ మూగిపోతారు. 'ఆరడుగులుంటాడా' అని పాడుకోడానికి అతను మహేశ్ బాబు కాదు. సినిమా హీరో అంతకన్నా కాదు. పాడడానికి స్టేజ్ ఎక్కాడంటే స్టెప్పులు వేసి మరీ రెచ్చిపోతాడు. అలాగని దేవిశ్రీ ప్రసాద్ కూడా కాదు. పైగా మ్యూజిక్ సెన్స్ తో పాటు విపరీతమైన  కెమెరా  సెన్స్.   పాడుతున్నప్పుడు ఏ యాంగిల్ లో స్టిల్లిస్తే  రిజిస్టర్ అవుతుందో ఆ టెక్నిక్ పట్టుకున్నవాడు. పట్టుమని పాతికేళ్ళు లేవు. పరిశ్రమకి వచ్చి నాలుగేళ్ళు కాలేదు.  ఫుల్ బిజీ ... అయితే రికార్డింగ్ లో లేకపోతే రియాల్టీ షో లో ...  ఈ   రెండూ  కాకపోతే విదేశాల్లో .. ఇతగాడి పేరు మీద అభిమానించే వారంతా ఫేస్ బుక్ లో ఓ అక్కౌంట్ క్రియేట్ చేస్తే దానికి 40 వేల మంది విజిటర్లు ... 'ఇంత సినిమా వుందా ఈ కుర్రాడికి అనుకోకండి'...  వివరాల్లోకెళ్ళాక డిసైడ్ అవండి ....

 
" ఎప్పుడు ఫోన్ చేసినా అమెరికా లో వున్నాడండి, దుబాయ్ వెళ్ళాడండి అని చెప్తున్నారు మీ ఇంట్లో ... మ్యూజిక్ షో   లకి సంబంధించి ఏయే దేశాలు ఎన్నిసార్లు తిరిగుంటావు ? "
" అమెరికా తొమ్మిది సార్లు, దుబాయ్ మూడు సార్లు, కువైట్ రెండు సార్లు, మస్కట్, సింగపూర్ ఒక్కొక్క సారి ... మరో  పది రోజుల్లో యూ.కే. "
" బావుంది. ఫస్ట్ ఫిల్మ్ సాంగ్ ఏది ? "
" మర్యాద రామన్న లో ఇన్నేళ్ళకు పెద పండగ వచ్చే"
" కీరవాణి గారి దగ్గర అవకాశం అంటే మాటలు కాదు కదా ... ఎలా దొరికింది చాన్స్ ? "
" నేను పాడిన డివోషనల్  సాంగ్స్  ఆయనకి తీసుకెళ్ళి ఇచ్చాను. అదే రోజు సాయంత్రం పిలుపొచ్చింది  మర్నాడు   రికార్డింగ్ కి రమ్మంటూ  ... 'రామ రామ కృష్ణ కృష్ణ' సినిమాలో కొన్ని కోరస్ బిట్ లు పాడించారు. ఆ తర్వాత  మర్యాద రామన్న లో సాంగ్ "
" సినిమాల్లో ఇప్పటి దాకా ఎన్ని పాటలు పాడుంటావు ? "
" దాదాపు అరవై వుంటాయి. "
" కీరవాణి గారు కాక ఇంకెవరు పాడించారు ? "
" మణిశర్మ గారు, చక్రి గారు, కోటి గారు, తమన్ గారు, వసంత్ గారు, జేబీ గారు "
" బాగా పేరు తెచ్చిన పాటలేవి ? "
" బద్రినాథ్ లో అంబదరి, చిరంజీవ చిరంజీవ ; దమ్ము లో రూలర్ ; రాజన్న లో వెయ్ వెయ్ ; బస్ స్టాప్ లో కలలకే  కలలొచ్చి ; ప్రేమ కథా చిత్రం లో వెన్నెలైనా చీకటైనా ఇవన్నీ నాకు మంచి పేరు తెచ్చాయి "
" టీవీ రియాల్టీ షోల ద్వారా కూడా మంచి గుర్తింపు వచ్చింది కదా ? "
" అవునండి .. ఫస్ట్ ఈ టేవీ వారి 'సప్త స్వరాలు' లో పాల్గొన్నాను. అందులో ఎస్పీ శైలజ గారు, మాల్గాడి శుభ గారు,    ఆర్పీ పట్నాయిక్ గారు, సునీత గారు అందరూ బాగా ఎంకరేజ్ చేశారు. ఆ తర్వాత మా టివీ వారి సూపర్  సింగర్ -  5  లో ఒక సింగర్ గా పాల్గొన్నాను. ఆ ప్రోగ్రామ్ సెలక్షన్ ప్రాసెస్ లో మీరు, రవికాంత్ గారు, సాయిప్రసాద్ గారు వున్నారు.  ఆ తర్వాత సూపర్ సింగర్ - 7. ఇందులో ఒక ప్లేబ్యాక్ సింగర్ గా సీనియర్ ప్లేబ్యాక్ సింగర్స్ తో పాల్గొన్నాను.  ఏ సీరీస్ లో ఒక సింగర్ గా పార్టిసిపేట్ చేశానో - అదే ప్రోగ్రామ్ తర్వాతి సీరీస్ లో - ఒక ప్లేబ్యాక్ సింగర్ గా పార్టిసిపేట్ చెయ్యడం గ్రేట్ గ్రేట్ గ్రేట్ ఎక్స్ పీరియన్స్ . థాంక్స్ టు మా టీవీ ... ఇదే కాదు మా టీవీ వారు వారి అవార్డ్ ఫంక్షన్స్ లో, ప్రొగ్రామ్స్ లో ఎక్కడ అవకాశం వుంటే అక్కడ నన్ను ఇన్వాల్వ్ చెయ్యడం తో ఎక్కడికెళ్ళినా నన్ను మా ఫ్యామిలీ మెంబర్ గా ట్రీట్ చేస్తున్నారు "
" అది సరే , ఎక్కడికెళ్ళినా నీ చుట్టూ అమ్మాయిలు  మూగిపోతూ వుంటారు ... ఏంటి రహస్యం ... డ్రెస్ కోడా, ఫంకీ  హెయిర్ స్టయిలా ...  ? "
" అయ్యో అదేం లేదండీ ... అందర్నీ నవ్వుతూ రిసీవ్ చేసుకుంటాను. ఎవరు ఫోన్ చేసినా రిప్లయ్ 
ఇస్తాను.  బిజీగా ఉండి ఎత్తలేకపోయినా తర్వాతైనా రెస్పాండ్ అవుతాను. ఆడవాళ్ళయినా , మగవాళ్ళయినా, చిన్నవాళ్ళయినా,  పెద్దవాళ్ళయినా కమ్యూనికేషన్ విషయంలో రెస్పాన్సిబుల్ గా వుంటాను. అదొక కారణం కావొచ్చు.  ఇక డ్రెస్  విషయంలో పెద్ద పట్టింపుల్లేవు.  చాలా మామూలుగా వుంటాను. ఏదుంటే అదే వేసేసుకుని బైటికొచ్చేస్తాను. అదెలా కుదిరిందో ఏమో గాని హెయిర్  స్టయిల్ బావుందని అంటుంటారు. నిజం చెప్పాలంటే ఇంటర్ వరకూ నాది మిలట్రీ కటింగే ... దాని మీద డెవలప్ అయిందే ఈ స్టయిల్ ... "
" మరి యాక్సెసరీస్ విషయంలో అమ్మాయిల్ని మించిపోతుంటావు కదా ? "
" అవి కూడా అంతేనండీ ... ఏది దొరికితే అవి వేసేసుకోవడమే ... కాకపోతే జాకెట్స్ మాత్రం ఇష్టంగా కొంటుంటాను.  అవి డిఫరెంట్ లుక్ ని ఇస్తాయి. ఇది కాక స్టేజ్ షోల్లో ఎక్కువగా స్టెప్స్ వేస్తూ, ఆడియన్స్ ని, ఒక్కొక్కసారి జడ్జెస్ ని  కూడా వాళ్ళు హర్ట్ కాని విధంగా ఇన్వాల్వ్ చేయిస్తూంటాను. అది చాలా మందికి నచ్చుతోంది "
" సో , మరొక దేవిశ్రీ ప్ర్రసాద్ అన్నమాట .. "
" ఈ మాట కూడా అంటున్నారండి జూనియర్ దేవిశ్రీ అని "
" సరే ... బీట్ ఓరియెంటెడ్ సాంగ్స్  పాడుతూ  గెంతుతూ వుంటే దమ్ము ఎలా సరిపోతోంది ? బ్రీతింగ్  ఎక్సర్ సైజ్ లు చేస్తున్నావా ? "
" చిన్నప్పుడు నేను ఆరెస్సెస్ స్టూడెంట్ నండి.  ఊపిరి బిగించి నీటి అడుగున ఇప్పుడు కూడా వన్ మినిట్ వుండగలను.  నా బ్రీత్ కంట్రోల్ ని శైలజ గారు మెచ్చుకున్నారు . 'సప్త స్వరాలు ' ప్రోగ్రామ్ అని చెప్పాను కదా ... అందులో  '  శ్రీరామదాసు ' సినిమాలోని 'అల్లా ...' పాట పాడాను. సినిమాలో ఆ పాటని శంకర్ మహదేవన్ గారు, విజయ్ ఏసుదాస్ పాడేరు. ఆ రెండు వెర్షన్ లూ నేనే పాడే సరికి శైలజ గారు బాగా ఎప్రిషియేట్ చేశారు. "
" ఇది ఓకే ... సింగర్ గా నీ డిక్షన్ కూడా అన్ని రకాల పాటలకూ సరిపోతోంది ... దీనికి సంబంధించి ఏవైనా ప్రాక్టీస్ లు  చేశావా ? "
" చిన్నప్పుడు నేను శ్రీకాకుళంలోని బాలభాను విద్యాలయం లో చదువుకున్నాను. అక్కడ పొద్దున్న భగవద్గీత,  సాయంత్రం వేదం సాధన చేయిస్తారు. ఇవాళ నా డిక్షన్ గురించి మీరు ప్రత్యేకంగా అడగడానికి కారణం అదేననుకుంటున్నాను. "
" సరే , నీ చిన్నతనం గురించి ... నీ ఫ్యామిలీ గురించి చెప్పు "
" మా నాన్నగారు నా చిన్నతనంలోనే పోయారు. ఆమ్మమ్మ తాతయ్య ఇంట్లో పెరిగాను. మాది చాలా పెద్ద ఫ్యామిలీ..  ఆరుగురు మేనమామలు ... వారికి మా అమ్మతో కలిపి ముగ్గురు అక్కచెల్లెళ్ళు. వారి వారి పిల్లలు ...  అమ్మమ్మ,   తాతయ్య ... ఇంత మంది మా ఫ్యామిలీ ... మా అమ్మ పేరు సీతా సుబ్బలక్ష్మి .  శ్రీకాకుళం చిన్న బజార్ లో ఇప్పిలి వారి  వీధిలో వుండే వాళ్ళం. టెన్త్ వరకూ శ్రీకాకుళం లోనే ...  ఒక్క సెవెన్త్ క్లాస్, ఇంటర్ నుంచి బీ కామ్ వరకూ వైజాగ్ లోనే "
" మ్యూజిక్ నేర్చుకోలేదా ? "
" వైజాగ్ లో కొత్తపల్లి విజయలక్ష్మి గారి దగ్గర కొన్నాళ్ళ పాటు రోజూ సాయంత్రం నాలుగు నుంచి రాత్రి తొమ్మిది వరకూ నేర్చుకునే వాణ్ణి. ఎక్కడా స్థిరంగా వుండకపోవడం తో సంగీతం అన్నది అడపా దడపా నేర్చుకునేది గా అయిపోయింది. ప్రస్థుతం వడలి ఫణి నారాయణ గారి దగ్గర నేర్చుకుంటున్నాను. " 
" ఈ ఫీల్డ్ లో ఎక్కువ కాలం వుండాలంటే ప్రతిభ, పరిశ్రమ, ప్రవర్తన ఈ మూడూ సమానంగా వుండాలని సి. నారాయణ రెడ్డి గారు చెప్పేవారు. నీకు ప్రతిభ వుంది. పరిశ్రమించే తత్వం వుంది. ఇక ప్రవర్తన ... దీని గురించి ఎటువంటి  జాగ్రత్తలు తీసుకుంటున్నావు ? 
" వైజాగ్ లో వున్న ఆశీర్వాద్ గారు, హైదరాబాద్ లో వున్న రామాచారి గారు - వీళ్ళని చూసి ఎంతో నేర్చుకున్నాను.  ఇక కీరవాణి గారి దగ్గరికొచ్చే సరికి మొత్తం నా బిహేవియరే మారిపోయింది. అంతగా నన్ను మార్చేశారాయన. ఇలా అడుగడుగునా నన్ను తీర్చి దిద్దేవారే నాకు తారసపడుతున్నారు. వీరి ఆశీర్వాదాల వల్ల నేను ఈ ఫీల్డ్ లో  నిలబడి,  నేననుకుంటున్న గోల్స్ రీచ్ అవగలనే అనుకుంటున్నాను "
" ఏంటా గోల్స్ ? "
" అన్ని భాషల్లోనూ పాడాలి "
" సినిమాల్లో నటించాలని లేదా ... ఇప్పటికే కొంతమంది అడుగుతున్నట్టున్నారు కదా ? "
" ఆడుగుతున్న మాట నిజమే ... కానీ ముందు నేను పాటల్లో హీరో అనిపించుకోవాలి. యాక్టింగ్ లో కాదు.
  అయినా సరదా కోసం యాక్ట్ చేసినా చేస్తానేమో "
" ఈ మధ్య కీరవాణి గారి ఫారిన్ షోస్ పుణ్యమా అని ఆయనతో చాలా రోజులు స్పెండ్ 
  చేసినట్టున్నావు ? "
" అవునండి ... దాదాపు 36 రోజులు "
" మరి దేవిశ్రీ గారు , మణిశర్మ గారితో వెళ్ళలేదా ? "
" దేవి గారి తో ఇండియాలోనే రెండు షోల్లో పార్టిసిపేట్ చేశాను. ఆయన సూపర్ సింగర్ లో నేను పాడిన ఓ
 రెండు పాటలు కోట్ చేసి చెబుతూ 'నీ వాయిస్ అంటే నాకు ఇష్టం ' అనడం లైఫ్ లో మరిచిపోలేను. అలాగే
 మరో పది రోజుల్లో యూకే అని ఇందాక చెప్పాను కదా అవి మణిశర్మ గారి షో లే ... ఇవన్నీ నన్నొక మెట్టు
 మీద నిలబెట్టేవే ... "
" ఈ ఇంటర్ వ్యూ ద్వారా ఎవరికైనా ఏవైనా చెప్పాలనుకుంటున్నావా ? "
" మా అమ్మ, మా కుటుంబ సభ్యులు, విద్య నేర్పిన గురువులు, అవకాశాలిచ్చి ప్రోత్సహించిన సంగీత దర్శకులు, మా టీవీ ఈ టీవీ వారు, తీర్చిదిద్దిన దైవసమానులు ఒకరేమిటి ... నా జీవితాన్ని మంచి మార్గంలోకి మళ్ళించడానికి  తారసపడిన ప్రతి ఒక్కరికీ ఎంతో ఋణపడివున్నాను. "
" ఇంతకీ నీ పేరు పెద్దవాళ్ళు పెట్టిందేనా ?"
" నేను రేవతి నక్షత్రంలో పుట్టాను. ఆడపిల్ల పుడితే రేవతి అని మగ పిల్లవాడు పుడితే రేవంత్ అని పేరు పెడదామనుకున్నారట. అలా నా పేరు రేవంత్ అయింది"
 
రాజా (మ్యూజికాలజిస్ట్)