This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...

 రిహార్సిల్స్ లో ఆయన పాట నేర్పిస్తుంటే ఆ రేంజ్ కి నా గొంతు నాకే వినపడేది కాదు - పి.బి.  శ్రీనివాస్ 

 
 ఆయన అసలు పేరు సుస్వరాల దక్షిణామూర్తి అయితే వాడుకలో అది సుసర్ల దక్షిణా మూర్తి అయివుంటుంది.- ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 
 
ఆయన గురించి చెప్పడమంటే పువ్వు చెట్టుని గురించి, నక్షత్రం ఆకాశం గురించి మాట్లాడినట్టు వుంటుంది -   కీ.శే . సత్యం (సంగీత దర్శకుడు)
 
 సినీ పరిశ్రమ లో అడుగు పెట్టిన ఏ గాయని అయినా ఆయన స్వర పరిచిన 'నిదురపోరా తమ్ముడా' పాటను స్టేజి మీద పాడి రావాల్సిందే - పి. సుశీల 
 
మా తరం సంగీత దర్శకుల్లో మ్యూజిక్కి సంబందించిన నాలెడ్జ్ విషయం లో ఆయన తో పోల్చదగ్గవారు చాలా తక్కువ -  ఎస్. జానకి 
 
 ఇవన్నీ మరణాంతరం మీడియా కోసం చెప్పిన మాటలు కావు. అలా అని ఆయన మంచి ఫామ్ లో వున్నప్పుడు అవకాశాల కోసం చెప్పినవీ కావు. పైగా చెప్పిన వాళ్ళు కూడా అటువంటి అవకాశ వాదులు కానే కాదు. ప్రతిభా సంపన్నుడైన ఒక మంచి మనిషి గురించి తమ మనసుల్లో వున్న అభిప్రాయాన్ని చెప్పుకునే అవకాశం కోసం ఎదురు చూసే వాళ్ళే. 
 
 సుసర్ల దక్షిణామూర్తి అనగానే మనకు సినీ సంగీత దర్శకుడు, నర్తనశాల సినిమా, లతా మంగేష్కర్ 'నిదుర పోరా తమ్ముడా' పాట ఇవన్నీ గుర్తొస్తాయి. కానీ శాస్త్రీయ సంగీత విద్వాంసులకు మాత్రం మంగళంపల్లి బాల మురళి కృష్ణ, ఆయన గురువు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు, వారి గురువు -సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి గుర్తొస్తారు. 
 
నిజమే ఈ గుర్తుకి ఆ గుర్తుకి మధ్య గుర్తుంచుకో దగ్గ బంధుత్వమే వుంది. త్యాగరాజ శిష్య పరంపరకి చెందిన ఆ సుసర్ల దక్షిణా మూర్తి శాస్త్రి - సినీ సంగీత దర్శకుడు సుసర్ల దక్షిణామూర్తి కి స్వయానా తాతగారు.  ఆ సుస్వర సంపదను వారసత్వం గా పుణికి పుచ్చుకోవడం వల్లనే వయొలిన్తో 
 
పదమూడవ ఏట రాజాస్తానాల్లో తన ప్రతిభను ప్రదర్శించి  పదహారవ ఏడుకి గజారోహణ సత్కారాన్ని అందుకున్నారు కూడా .
 
తర్వాత ఆలిండియా రేడియో లో ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొంది చాలా కార్యక్రమాలలో పాల్గొనడమే కాకుండా సౌతిండియన్ మ్యూజిక్ విభాగానికి స్టేషన్ డైరెక్టర్ గా ఆహ్వానాన్ని అందుకున్నారు .
 
ఆ ఆహ్వానాన్ని స్వీకరించకుండా మద్రాసు వైపు ఆయన సాగించిన సినీ సంగీత ప్రస్థానం అందరికీ తెలిసినదే కనుక ఆ ప్రస్థానం లో శ్రోతలకు మిగిల్చిన కొన్ని మధుర మైన మలుపులు, మజిలీలు గురించి తలపుల తలుపులు తెరిచి తల్చుకుందాం - ఆయనకు ఓ నివాళిగా !
 
 కొన్ని కొన్నిజిలుగులు తళుక్కుమని మెరిసి వెళ్ళిపోతుంటాయి. అలాటివి పాటలో ఎక్కడో దగ్గిర వేసి - ఆ పాటకు కొత్తందాలు తీసుకురావడం లో సుసర్ల వారి శైలి విభిన్నంగా వుంటుంది. ఉదాహరణకి 'బండ రాముడు' లో 'ఒకసారి ఆగుమా ఓ చందమామ' పాటలో చివరకి 'మారేన నీ మనసు ఓ చందమామ' అంటూ    ఓ అద్భుతమైన మలుపు ఊహించని విధంగా తిరుగుతుంది. విన్నవాళ్ళే కాదు - ఎప్పుడు ఎక్కడ ఎవరు పాడినా సరే - ఈ మలుపుని ఎంజాయ్ చెయ్యకుండా పాడడం జరగదు. అదీ సుసర్లంటే . అలాగే 'ఎవ్వరి కోసం ఈ మంద హాసం' (నర్తనశాల) పాట చివర్న పల్లవి రిపీట్ కాగానే వచ్చే వయొలిన్ బిట్. ఇది మొత్తం పాటలో ఒకేసారి వస్తుంది. అయినా ఆ పాట ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఈ బిట్ ని హమ్ చెయ్యని సంగీత ప్రియులుండరు. మళ్ళీ నర్తనశాల లోనే 'సఖియా వివరించవే' పాటలో ... చిట్ట చివరికి ల్యాండింగ్ గా వచ్చే ఆలాపన ... పాడే వారి నోట ఈ ఆలాపన రాగానే వినే వారి ముఖంలో వెలుగు తో కనిపించే ఎక్స్ ప్రెషన్ ని కెమెరా తో క్యాచ్ చేసి చూపించాలే తప్ప ఎంత వర్ణించినా అది  ఆ అనుభవానికి నీడలా వుంటుందే తప్ప ప్రతిబింబంలా ఉండలేదు. 
 
కొన్ని కొన్ని పాటల్ని ఎడాప్ట్ చేసినప్పుడు ఆయన చేసిన ప్రయోగాల్ని ప్రయోగాలుగా గుర్తించకుండా ఆ పాటల్ని పూర్తిగా ఆయన ఎక్కౌంట్ లో వేసేసారు మనవాళ్ళు. ఉదాహరణకి ఎమ్జీఆర్, భానుమతి నటించిన 'ఆలీబాబా 40 దొంగలు. అంతకు ముందు మహిపాల్, షకీలా హీరో హీరోయిన్లుగా  హిందీ లో వచ్చిన 'ఆలీబాబా చాలీస్ చోర్' ఆధారంగా తీశారీ సినిమాని. చిత్రగుప్త - ఎస్. ఎన్. త్రిపాఠి స్వరపరిచిన కొన్ని ట్యూన్ లని  తెలుగు, తమిళ వెర్షన్ లకు వాడుకున్నారు. అందులో 'ప్రియతమా మనసు మారునా' (తమిళం లో 'మాసిలా వున్మై కాదలా') ఒకటి. హిందీ వెర్షన్ లో 'ఏ సభా ఉన్ సే కెహ జరా' . అయినా సరే ఈ పాటను సుసర్ల వారి సృజన గా చెప్తారు. నిజానికి తెలుగు తమిళ వెర్షన్ లకు ఆయన చేసిన మార్పు వేరు. హిందీ వెర్షన్ లోని తాళ గతిని మార్చి పాటను స్పీడు చేశారు. ఇంటర్లూడ్లు మార్చారు. అవేవీ గుర్తింపు లోకి రాకుండా పోయాయి. 
 
 అలాగే 'వీర కంకణం' లో జగ్గయ్యకు  ఘంటసాల పాడిన రెండు పాటలు. ఈ సినిమాలో హీరో ఎన్టీయార్ కి ఏయం రాజా చేత, విలన్ జగ్గయ్య కి ఘంటసాల చేత పాడించారని - ఇదొక ప్రయోగం అనీ తెగ చెప్పేసుకున్నారు. నిజానికి అది ప్రయోగం కాదు. అవసరం. సుసర్ల దాన్ని తెలివిగా పరిష్కరించుకున్నారు. 'వీర కంకణం' లో  ఎన్టీయార్ పాటలకు ఘంటసాలే అక్కర్లేదు. కానీ జగయ్య పాటలకు ఘంటసాలే కావాలి. ఎందుకంటే తమిళ మాతృక  'మంత్రి కుమారి' లో జి. రామనాథన్ స్వరపరిచిన ట్యూన్లు అటువంటివి. ఈ 'వీర కంకణం' లోని ' తేలి తేలి నా మనసు' (తమిళం లో 'ఉలవుమ్ తెన్ద్ర పాటయిలే') పాటలో 'కొండ వంటి గుండె నీవు తెలియ లేవులే' దగ్గిర 'నీదు ఓర చూపులోన నేర్చుకుంటినే' దగ్గిర గల ఎగుడు దిగుడుల్లో వాయిస్ మీద పూర్తిపట్టు తో పాడాలి. 'నలుసులెన్ని ఉన్నవో తెలుసుకోగదే' దగ్గర వాయిస్ ని ఒక్కసారిగా రెయిజ్ చెయ్యాలి. ఇవన్నీ ఘంటసాల గొంతుకి నప్పుతాయి. అలాగే 'రావే రావే పోవు స్థలం అతి చేరువయే నా రాణీ ' (తమిళం లో 'వారాయ్ నీ వారాయ్) పాట తెలుగులో ఘంటసాల తప్ప మరొకరు పాడలేని పాట. బాలూ వంటి గాయకుడు డిమాన్ స్త్రేట్ చేసి చూపిస్తే తప్ప ఈ పాటకు ఘంటసాల వాయిస్ ఎంత అవసరమో విప్పి చెప్పలేనంత గొప్ప పాట. అందుకే ఈ పాటల్ని ఘంటసాల చేత పాడించడం ప్రయోగం కాదు అవసరం. 
 
అసలు ప్రయోగం ఇంకోచోట వుంది. అది ఆ తర్వాత రిలీజ్ అయిన జగపతి వారి తొలి చిత్రం 'అన్నపూర్ణ' లో. ఈ చిత్రం లో హీరో  జగయ్య కి పీ బీ శ్రీనివాస్ చేత (మనసేమిటో తెలిసిందిలే పాట), హాస్య పాత్రధారి రేలంగి కి ఘంటసాల చేత పాడించడం. జగయ్య కి పీబీ వాయిస్ బావుంటుంది. కానీ రేలంగి కి ఘంటసాల చేత పాడించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయిన మాధవ పెద్ది వున్నాడు. పైగా గతం లో తనే రేలంగికి (సంసారం లో 'సొగసైన క్రాఫ్ పోయే నగుమోము చిన్నబోయే పాటనీ , ఇలవేల్పు లో 'సాంబ్రాణి ధూపమేసి పట్టనా' వంటి పాటనీ) పాడి హిట్ చేసిన చరిత్ర వుంది సుసర్లకి .అయినా ఘంటసాల చేత (వగలాడి వయ్యారం భలే జోరు పాట) పాడించడం ... అదీ మహా లబ్జుగా ... ఇది సాహసం కాదు ... సామర్ధ్యం... 
 
 ఇవికాక తెలుగు వారి సంప్రదాయానికి సుసర్ల వారు తన వంతుగా సమర్పించిన గీతాలు ఓ రెండున్నాయి. ఒకటి 'సంసారం' లో   'అమ్మా శ్రీ తులసీ దయారాశివమ్మా'   పాటైతే ఇంకొకటి 'నర్తనశాల' లో 'జయ గణ నాయక విఘ్న వినాయక'. మొదటిది లేకుండా తులసి పూజ , రెండవది లేకుండా నృత్య పూజ జరగడం తెలుగింట అరుదు. 
 
 సుసర్ల వారి శరీరం ఎంత ధృఢమైనదో ఆయన శారీరం (గాత్రం) అంత కంటే ధృఢమైనది. అది ఎంత రేంజ్ కి వెళ్ళగలదో తెలుసుకోవాలంటే 'సంతానం' లో ఘంటసాల చేత పాడించిన రెండు పాటల్ని గమనిస్తే చాలు. మొదటిది 'కనుమూసినా కనిపించే నిజమిదే' అనే విషాద గీతం. రెండవది అందరికీ తెలిసిన 'దేవీ శ్రీదేవీ' అనే ప్రేమ గీతం. 
 
షణ్ముఖ ప్రియ రాగానికి ఉదాహరణగా సినీ గీతాన్ని చెప్పమంటే ఎవరైనా సరే మొదట చెప్పే పాట - దేవీ శ్రీదేవీ. ఈ పాటను ఆ రేంజ్ లో పాడగలగడం ఘంటసాల అభిమానులకు ఓ స్టేటస్ సింబల్. అలా రేంజ్ లోకి వెళ్ళ గల గాత్రాలుంటే అంత రేంజ్ లో పాటల్ని స్వర పరచడమే కాక పాడి - పాడించడం లో దిట్ట సుసర్ల. అందుకు మరో ఉదాహరణ 'సంతానం' అనగానే గుర్తొచ్చే పాట - తెలుగువారు గర్వంగా చెప్పుకునే పాట - సుసర్ల వారి కీర్తి కిరీటం లో కలికి తురాయి గా నిలిచిపోయిన పాట - 'నిదురపోరా తమ్ముడా'. ఈ పాటలో 'జాలి తలచి కన్నీరు తుడిచే దాతలే కనరారే' దగ్గర లతా వాయిస్ ని ఎంత రేంజ్ కి వెళ్లేట్టు చేసారో తిరిగి అదే పాట ఘంటసాల వెర్షన్ తో  రిపీట్ గా వచ్చినప్పుడు ఆయన వాయిస్ ని కూడా అదే రేంజ్ లో వాడుకున్నారాయన. ( ఈ పాట పాడి ఇంటికి వెళ్ళాక - 'లతా మంగేష్కర్ వచ్చిందని సూట్ లో వచ్చాడు దక్షిణామూర్తి ' అని చెప్పారట ఘంటసాల తన భార్య సావిత్రమ్మ తో).
 
ఇలా రేంజ్ వున్న సాంగ్స్ తో పాటు మాధుర్యం తో తొణికిస లాడే మృదువైన గీతాలను అభిమానించే వారి కోసం కూడా తక్కువేం చెయ్యలేదు సుసర్ల. అందుకు ఫస్ట్ అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ గా 'చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో ' (సంతానం) పాటనే చెప్పుకోవాలి. ప్రభుదేవా నటించిన 'ప్రేమికుడు' సినిమాలో అతనితో మందు తాగిస్తూ 'ఎవర్ని ప్రేమించావు ?' అని అతని తండ్రి ( ఎస్పీ బాలు) అడిగే సీన్ గుర్తుందా ? అక్కడ సరదాగా బాలూ హమ్ చేసిన పాట ఇదే. నిజానికి అది డబ్బింగ్ సినిమా కాబట్టి ఏ పాట హమ్ చేసినా చెల్లిపోతుంది. కానీ ఈ పాటనే బాలూ ఎన్నుకోవడానికి గల కారణం ఆ పాటపై బాలూ కున్న మక్కువతో పాటు  ఆ ఎంపిక ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారనే నమ్మకం కూడా. నిజానికి అలానే జరిగింది. అలా ఆ క్రెడిట్ లో కొంత పరోక్షం గా సుసర్ల వారికి వెళుతుంది.
 
 సంతానం సినిమాలోని ఇన్ని పాటల గురించి చెప్పి ' సంతోషమేలా సంగీతమేలా ' పాటని పేర్కొనక పోతే అది అన్యాయం అవుతుంది. నిజానికి ఈ పాట ట్యూన్ సుసర్ల వారిది కాదు. శాంతారాం తీసిన 'సుభా కా తారా' సినిమాలోని 'గయా అంధేరా హువా ఉజాలా' పాట ట్యూనది. కానీ పాడింది - ఎస్పీ కోదండపాణి (జమునారాణి తో కలిసి). గాయకుడిగా ఎస్పీ కోదండపాణి అనగానే 'ఇదిగో దేవుడు చేసిన బొమ్మ' (పండంటికాపురం) పాటనే ఆయన మొదటి పాటనుకుంటారు. ఆయనతో సుసర్ల వారెప్పుడో పాడించారని చాలా మందికి తెలియదు. అలా ఎమ్మెల్ వసంత కుమారితో 'వచ్చిన కోడలు నచ్చింది' లో పాడించిన ఘనత కూడా ఈయన అక్కౌంట్ లో వుంది. కోదండపాణి తో పాడించడానికి కారణం ఆయన తనకు  అసిస్టెంట్ గా పనిచేయడమే. ఒక్క కోదండపాణే కాదు ఎమ్మెస్ విశ్వనాథం, ఎ ఎ రాజ్ వీరంతా సుసర్ల వద్ద పని చేసిన వారే.  
 
ఎమ్మెల్ వసంత కుమారి తో పాడించినట్టే ఒరియా గాయకుడు రఘునాథ పాణిగ్రాహి తో 'చల్లని రాజా ఓ చందమామా' (ఇలవేల్పు) పాటని పాడించడం,    ఆ పాట అటు పాణిగ్రాహి కెరీర్ కి, ఇటు తెలుగు సినీ సంగీత చరిత్ర కి ఒక ల్యాండ్ మార్క్ గా మిగిలిపోవడం సుసర్ల వారి క్రెడిట్స్ లో చేర్చదగ్గవి. 
 
ఇక్కడ మరో రెండు విషయాలు చెప్పాలి. అక్కినేనికి ఘంటసాల అలవాటు అవుతున్న రోజుల్లో రఘునాథ పాణిగ్రాహితో  'చల్లనిరాజా ఓ చందమామా ' పాడించడం ఒకటైతే, ఘంటసాల బాగా అలవాటయి పోయిన తర్వాత ఎన్టీఆర్ కి 'బండరాముడు' లో పిఠాపురం నాగేశ్వర రావు తో  (రకరకాల పూలు పాట) పాడించడం, అదే సినిమాలో నాగయ్య కి ఘంటసాలతో (రాధా మోహన రాస విహారీ పాట) పాడించడం ... వీటినేమంటారు ?ఇందాక అనుకున్నట్టు సాహసమా .. సామర్ధ్యమా .... లేక ప్రయోగమా !?  అలా అయితే ఒకే సినిమాలో (నర్తనశాల) ఎన్టీఆర్ కి (బృహన్నల్ల గా వున్నప్పుడు) అటు ఘంటసాలతో (జయ గణ నాయక) ఇటు బాలమురళి తో (సలలిత రాగ సుధా రస సారం) పాడించడాన్ని ఏం అంటారు ? 
 
ఇక నర్తనశాల విషయానికొస్తే ఏ పాటని హిట్ కాని పాటగా తీసేయ్యగలం ? నరవరా ఓ కురువరా,  జననీ శివ కామినీ, జయ గణ నాయక, సలలిత రాగ సుధారస, ఎవ్వరి కోసం ఈ మందహాసం , సఖియా వివరించవే, దరికి రాబోకు రాబోకు రాజా ఇలా ఏ పాటని మర్చిపోగలం ... మరి పద్యాలు ... ఏనుంగు నెక్కి పెక్కేనుంగులిరుగడరా ,  కాంచన మయా వేదికా ... వీటికి అమృత ధారలద్దినది సుసర్ల సుస్వరాలే కదూ !? 
 
ఈ సందర్భం గా మరో సంగతి చెప్పుకోవాలి. 'నర్తనశాల' వచ్చిన 16 ఏళ్ళ తర్వాత అదే కథాంశం తో 'శ్రీ మద్విరాట పర్వం' వచ్చింది. దీనికీ సుసర్లే సంగీత దర్శకుడు. ఆ సినిమాతో పోలిస్తే మిగిలిన పాటలకి లేని ఇబ్బంది ఓ పాటకి వచ్చి పడింది. నర్తనశాల లో సైరంధ్రి కీచకుణ్ణి ఆహ్వానిస్తూ 'దరికి రాబోకు రాబోకు రాజా' అంటూ పాడుతుంది. అది సోలో. ఇక్కడ శ్రీమద్విరాట పర్వం కొచ్చే సరికి (ఎన్టీఆరే కీచకుడు కనుక ) కీచకుడు కూడా గొంతు కలుపుతాడు. పైగా నెగిటివ్ రోల్ లో ఎన్టీఆర్ అభినయించిన 'చిత్రం హాయ్ భళారే విచిత్రం ' పాట (దాన వీర శూర కర్ణ) అప్పటికే హిట్టు. దానికి సుసర్ల ఓ తమాషా చేశారు. 'మనసాయెనా మతి పోయెనా' అని సైరంధ్రి అంటే 'ఎప్పుడు మనసౌతుందో అప్పుడు మతిపోతుంది - ఎప్పుడు మతి పోతుందో అప్పుడే కథ మొదలవుతుంది' అని ఎత్తుకుంటాడు కీచకుడు. సరిగ్గా కీచకుడి లైన్స్ రాగానే వెనుక ఇన్ స్త్రుమెంట్స్ అన్నీ వెస్ట్రన్ స్టయిల్లో ఫాలో అవుతాయి. జనం కొత్తదనం  ఫీలయ్యారు. ఆనందించారు. 
 
ఇలా చెప్పుకుంటూ పోతే సుసర్ల వారి పాటల గురించి ప్రత్యేకం గా ఓ పుస్తకమే వెయ్యొచ్చు. 'నారద-నారది' సినిమా తో స్వతంత్ర సినీ సంగీత దర్శకుడికి గా మొదలైన ఆయన జీవనం ఎన్నో మలుపులు తిరిగింది. లక్ష్మమ్మ కథ, స్త్రీ సాహసం, పరమానందయ్య శిష్యులు చిత్రాల్లో అక్కినేని కి ప్లే బ్యాక్ పాడడం, సర్వాధికారి చిత్రం లో ఎమ్జీఆర్ కి డబ్బింగ్ చెప్పడం లాంటివి కూడా వాటిలో కొన్ని.  సంగీత దర్శకుడి గా వర్క్ తగ్గాక ఖాళీగా కూచోలేదు. చక్రవర్తి ఆర్కెష్ట్ర లో వయోలిన్ వాయించే వారు. ఆ పనిని ఆయన చిన్నతనం గా ఫీలవలేదు. అది కూడా సంగీతారాధనే అనుకునే వారు. చక్రవర్తి కూడా ఈయన్ని ఎంతో గౌరవంగా చూసుకునేవారు. 
 
ఓసారి రికార్డింగ్ కి ధియేటర్లోకి వెళుతున్నారు సుసర్ల. అంతకు కొన్నేళ్ళ క్రితమే చక్రవర్తి ఆర్కెష్ట్ర లో చేరిన ఓ కుర్రాడు కాళ్ళు బార్లా జాపుకుని అడ్డం గా కూచున్నాడు. అతన్ని దాటుకుని వెళ్ళడం కుదరక తప్పుకుని వేరే రూట్లో ధియేటర్ కి వెళ్లారాయన. అదంతా గమనించిన చక్రవర్తి కి కోపం నసాళానికి అంటింది. స్పీడు గా వెళ్లి ఆ కుర్రాడు కూర్చున్న కుర్చీని ఓ తాపు తన్నారు - " ఆయన ఎవరనుకుంటున్నావురా ? ఆయనకున్న విద్వత్తు మనకి రావాలంటే పది జన్మలెత్తాలి మనం " అన్నారు గట్టిగా అరుస్తూ. ఈ సంఘటన ఒక్కటి చాలు సుసర్ల పట్ల విషయం వున్న సీనియర్ సంగీత దర్శకులు ఎంత గౌరవాన్ని కన్పర్చేవారో చెప్పడానికి. 
 
కాల క్రమేణా షుగర్ వ్యాధి ముదరడం వల్ల ఆయనకు చూపు పోయింది. వయోభారంతో వినికిడి శక్తి బాగా తగ్గిపోయింది. గత సంవత్సరం సెప్టెంబర్ 10 న రేడియో మిర్చి వాళ్ళు ఇచ్చిన లైఫ్ టైం ఎచీవ్ మెంట్ అవార్డే సుసర్ల అందుకున్న ఆఖరి అవార్డు. వృద్ధాప్యం వల్ల శారీరకం గా నీరసించి పోయారే గాని కొంతమంది రాస్తున్నట్టుగా వ్యాధి గ్రస్తుడై పోలేదాయన. పోయే ముందు కూడా 'నన్ను హాస్పిటల్ కి తీసుకు వెళ్లొద్దు' అని స్పష్టం గా చెప్పి మరీ  పోయారు.
 
ఏది ఏమైనా చంద్రుడున్నంత కాలం తెలుగు వారికి 'చల్లని రాజా ఓ చందమామా' పాట వుంటుంది. కంటికి నిద్ర సుఖం తెలిసున్నంత వరకూ 'నిదుర పోరా తమ్ముడా' గుర్తుంటుంది. మంచి సంగీతం మీద గౌరవం ఉన్నంత వరకూ 'సలలిత రాగ సుధా రస సారం' ఆగకుండా ప్రవహిస్తూ వుంటుంది. అదే సుస్వర వాహిని.. సుసర్ల వాహిని.
 
----
 
రాజా(మ్యూజికాలజిస్ట్)