This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Film Reviews
వేగ వేగ వేసెయ్యర అడుగు (నిప్పు )

వేగ వేగ వేసెయ్యర అడుగు (నిప్పు )

 

 

                     వేగ వేగ వేసెయ్యెర అడుగు

                     వేగం అంటే గాలిని అడుగు

                     గాలిని తాకి మబ్బే కరుగు 

                     మబ్బే కరిగి చినుకై దూకు 

                     చినుకు చినుకు ఏరై ఉరుకు 

                      ఏరే కడలై నీరై పొంగు 

                       నీరే పొంగి నిప్పై మరుగు

                       నిప్పెవరంటే నన్నే అడుగు

 

            అడుగులు అడుగులు పిడుగులు అడుగులు

            చెడుగుడు చెడుగుడు చెడుకిక చెడుగుడు

             మనసుకి భయపడు మనసుల జతపడు 

             మనసును గెలిచిన మనిషే దేవుడు  

 

ఇదీ చంద్రబోస్ 'నిప్పు' సినిమా కోసం రాసిన పాట. ఇది ట్యూన్ కి రాసిన పాట. సాధారణంగా సంగీత దర్శకుడు ట్యూన్ ఇచ్చేటప్పుడు డమ్మీ లిరిక్స్ తో గాని  'తత' కారాలతో గానీ ఇస్తాడు. ఇక్కడ సంగీత దర్శకుడు తమన్ తన ట్యూన్ ని బోస్ కి 'తత' కారాలతో ఇచ్చాడు. వీటికి సాహిత్యం సమకూర్చాలి. సాహిత్యం సమకూర్చడం అంటే అక్షరాల పేర్పు కాదు. భావాలతో అక్షరాల కూర్పు.  'ఇదేమిటీ , ఎందుకూ' అని అడిగితే వివరించి ఒప్పించగలిగే నేర్పు వుండాలి రచయితకి. అప్పుడే ప్రేక్షక శ్రోతల తీర్పు బాగుంటుంది. గర్భం లో ప్రాణం పోసుకున్న జీవాన్ని ప్రపంచం లోకి పంపించడానికి తల్లి ఎంతటి ప్రసవ వేదన అనుభవిస్తుందో , గుండెల్లో రూపు దిద్దుకున్న భావాన్ని అక్షర ప్రపంచం లోకి పంపించడానికి అంతటి అంతర్మధనాన్నీ అనుభవిస్తాడు కవి.  ఈ పాట పల్లవి రాయడానికి 15 రోజులు పట్టింది చంద్రబోస్ కి. మొట్ట మొదటి కారణం ట్యూన్. 

 

ఈ ట్యూన్ ని 'తత' కారాల తో అనుకుంటూ చంద్రబోస్ ఇచ్చిన సాహిత్యం తో కంపేర్ చేసుకుంటూ చూడండి ... కష్టం తెలుస్తుంది. కష్టం ఎందుకూ అంటే చాలా సవాళ్లు ఉన్నాయి నేటి సినీ రచయితకి. అందులో హీరో ఇమేజ్ మొదటిది. తరువాత సంగీత దర్శకుడు, దర్శకుడు, నిర్మాత తో గల సంబంధ బాంధవ్యాలు. (అప్పుడే కథ, కథతో ఈ పాటకి గల ప్రాదాన్యత తెలుస్తుంది రచయితకి.    కట్ చేస్తే డ్యూయెట్ అండీ .. మాంఛి డ్యూయెట్ఒకటి ఇరగ దియ్యాలిక్కడ ... అని కథ చెప్పకుండా పాట రాయించుకునే రోజులు కదా) అందుకని ఎంత ఒద్దనుకున్నా ఇవన్నీ మైండ్ లో అండర్ కరెంట్ గా వర్క్ అవుట్ అవుతూనే వుంటాయి రచయితకి.

 

వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుంటూ - ఏకాగ్రతకి ఇవి అడ్డు రాకుండా రాయాలి. అదీ సవాల్. 

 

హీరో రవితేజ డైలాగ్ డెలివరీ నుంచి పెర్ఫార్మెన్స్ దాకా స్పీడు వుంటుంది. అంచేత - వేగ వేగ వేసెయ్యర అడుగు. ఇది బిగినింగు. వేగ అనడం పాత పధ్ధతి. ( పాత సినిమా పాటల్లో వేగ రారా అనే పదాలుండేవి).

వేగం అంటే బావుంటుంది కానీ ట్యూన్ కి నప్పదు.   ఆ పాత పదాలతో  ఈ జనరేషన్ ని ఒప్పించాలంటే తర్వాతి లైన్స్ తో ఆకట్టుకోవాలి. 

 

 సినిమా పేరు నిప్పు . హీరో క్యారెక్టర్ ని తెలిపే టైటిల్ - ఈ టైటిలూ, ఆ క్యారెక్టరూ ఈ రెండూ పల్లవిలో వర్కవుట్ అయితే జనాలకి పట్టుకుంటుంది. కాబట్టి - నిప్పెవరంటే నన్నే అడుగు. ఇది కన్ క్లూజన్ .

ఇప్పుడు బిగినింగు నుంచి కన్ క్లూజన్  కి చేరే పద్ధతిలో - వాటికి   వేసే లింకుల్లో రీజనింగ్ వుండాలి . 

వేగం కి ఉదాహరణగా గాలిని చెప్పుకుంటాం కనుక - వేగం అంటే గాలిని అడుగు. ఆ తర్వాత ఇంక ఒకటే వరస - గాలిని తాకి మబ్బే కరుగు - మబ్బే కరిగి చినుకై దూకు -చినుకు చినుకు ఏరై ఉరుకు - ఏరే కడలై నీరై పొంగు - నీరే పొంగి నిప్పై మరుగు. కంక్లూజన్ కి వచ్చేసింది.   నిప్పెవరంటే నన్నే అడుగు. 

 

ఇక్కడ ఎవరికైనా కలిగే డౌట్ ఏమిటంటే - నీరు పొంగితే నిప్పుని ఆర్పుతుంది కానీ నిప్పై ఎలా మరుగుతుంది ? కానీ నీటి అడుగున బడబాగ్ని వుంటే ఆ నీరు మరిగి పొంగుతుంది. ఒక విధంగా ఇది హీరో క్యారెక్టర్ ని ఎలివేట్ చేసే ఎక్స్ ప్రెషన్.

 

ఇక - అడుగులు అడుగులు పిడుగులు అడుగులు - చెడుగుడు చెడుగుడు చెడుకిక చెడుగుడు.

 

ఇలాంటి - టక టక టక టక - టైపు ట్యూన్లిస్తూ ఉంటాడు తమన్ . (కావాలంటే 'దూకుడు' టైటిల్ సాంగ్ ని గుర్తు చేసుకోండి - సమరమే సై ఇక చెలగిక చక చక - ఎడతెగ చెయ్ ఇక విలయపు తై తక). అటువంటి ట్యూన్ లకి పదాలు పేర్చినట్టు కాకుండా అర్ధవంతం గా ఉండేట్టు రాయాలి. సహ రచయితల ప్రయోగాలకు దీటుగా ,  పూర్వ కవుల ప్రయోగాలు రిపీట్ కాకుండా చెప్పాలి. 

అందుకే - అడుగులు అడుగులు పిడుగులు అడుగులు -చెడుగుడు చెడుగుడు చెడుకిక చెడుగుడు .

 

అలా అని తను చెడు అనుకున్నవారినందరినీ నరుక్కుంటూ పోయే సైకాలజీ వుండకూడదు హీరోకి. తన మనసుకి తాను జవాబుదారి గా వుండాలి. అటువంటి నిజాయితీపరుల తోనే తను కలిసుండాలి. అందుకే - మనసుకి భయపడు. (అటువంటి) మనసుల(తో) జతపడు. ఇటువంటి మనసుల్ని గెలిచిన మనిషే దేవుడనిపించుకుంటాడు. హీరో అంటే అంతే కదా మరి !?

 

ఇదీ థాట్ ప్రాసెస్. ఈ థాట్ ప్రాసెస్ లో అనుకున్నదంతా పల్లవిలో  క్లియర్ గా వచ్చేస్తే చరణాలు ఆటోమాటిక్ గా పరుగెడతాయి.  అదే జరిగిందీ పాటలో. ఈ ప్రాసెస్ ని దృష్టిలో పెట్టుకుని , సాహిత్యాన్ని దృష్టి ముందు పెట్టుకుని పాటని విని చూడండి. 

 

వేగ వేగ వేసేయ్యర అడుగు

వేగం అంటే గాలిని అడుగు

గాలే తాకి మబ్బే కరుగు

మబ్బే కరిగి చినుకై దూకు

చినుకు చినుకు ఏరై ఉరుకు

ఏరే కడలై నీరై పొంగు

నీరే పొంగి నిప్పై మరుగు

నిప్పవరంటే నన్నే అడుగు

అడుగులు అడుగులు పిడుగులు అడుగులు

చెడుగుడు చెడుగుడు చెడుకిక చెడుగుడు

మనసుకు భయపడు మనసుల  జతపడు

మనసుని గెలిచిన మనిషే దేవుడు

 

చరణం 1

ఎవర్ని ఫాలో కాను నాతో నేను పోతుంటాను

ఎవరికీ పోటి కాను నాకే నేను ఎదురొస్తాను

ఎవరితో పంతం లేదు నాతో నేను కలిసుంటాను

ఎవరికీ అర్ధం కాను నాకే నేను తెలిసుంటాను

ఎవరికీ వుండని దారుంది

వేరెవరికి చెందని తీరుంది

పరులెవరికి లొంగని ఫైరుంది

నేన్నాలా ఉంటె తప్పేముంది

ఎరగను ఎరగను ఎవరిని కెలుకుడు

కెలికితే జరుగును ఎముకల విరుగుడు

తొడగను తొడగను మనసుకి ముసుగును 

మనిషిగ మసలిన మనిషే దేవుడు

 

చరణం 2

ఎటైనా వెళ్తుంటాను భారం లేదు తీరం లేదు.

ఏదైనా చేస్తుంటాను ఆశే లేదు హద్దే లేదు

ఎలాగో బతికేస్తాను స్వప్నం లేదు సొంతం లేదు

ఇలాగే గడిపేస్తాను గమ్యం లేదు లక్ష్యం లేదు

నిన్నటి గురుతే లేకుంది

మరి నేటికి కొరతే లేకుంది

మరునాటికి కలతే లేకుంది

ఏదీ లేకుంటే లేనిది ఏది

ఎగసిన పిలుపుకి బదులిక వినపడు

మెరిసిన కనులకి చెలిమిక కనపడు

తెరిచిన మనసుకి మనసుతో ముడిపడు

మనిషిగ ఎదిగిన మనిషే దేవుడు 

@@@@@@@@@@